Nara Lokesh: రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh to Create 2 Million Jobs by 2029 Minister Nara Lokesh
  • 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం ఏర్పాటు
  • నేడు ఉండవల్లి నివాసంలో రెండో సమావేశం
  • పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించిన అధికారులు
  • దిశానిర్దేశం చేసిన మంత్రి నారా లోకేశ్
రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఉండవల్లి నివాసంలో ఇవాళ... 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం జరిగింది. ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనతో పాటు వివిధ ఎంవోయూల స్థితిగతులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

మంత్రుల ఉపసంఘం ఛైర్మన్ హోదాలో మంత్రి లోకేశ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇన్వెస్ట్ మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. భూకేటాయింపులు, అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలు ట్రాకర్ లో ఉంచాలన్నారు.

పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రతిబంధకంగా మారిన విధానాల్ని సంస్కరిస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు ప్రతి పాలసీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగాను, దేశంలోనూ ఉన్న అన్ని పెద్ద కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు మరింతగా విస్తరించేలా వారిలో నమ్మకం కల్పించాలని, వారికి ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అన్నారు. 

"రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. వారికి అవసరమైన భూకేటాయింపులతో పాటు అనుమతులు, రాయితీలు త్వరితగతిన మంజూరు చేయాలి. ఎంఎస్ఎమ్ఈ రంగంలో పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎంఎస్ఎమ్ఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. ఐటీఐ, పాలిటెక్నిక్ ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించాలి. పోర్టుల అభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించాలి. టూరిజం రంగంలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి" అని వివరించారు. 

మైనింగ్ రంగంలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంపైనా దృష్టిసారించాలని మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. 

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు అజైయ్ జైన్, ఎన్.యువరాజ్, కాటమనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్, సాయికాంత్ వర్మ, ఎమ్. అభిషిక్త్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Job Creation
Investment
MSME
Tourism
Mining
IT
Policy Reforms
Infrastructure Development

More Telugu News