Sunrisers Hyderabad: రాయల్స్ కూడా బాదినా.... సన్ రైజర్స్ దే గెలుపు

Sunrisers Hyderabad Beat Rajasthan Royals in IPL 2025 Opener
  • ఉప్పల్ స్టేడియంలో బౌండరీల వర్షం
  • భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ విజేత
  • రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో గెలిచిన సన్ రైజర్స్
ఐపీఎల్2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో శుభారంభం చేసింది. నేడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఇషాన్ కిషన్ (106 నాటౌట్) అద్భుత సెంచరీ సాధించడం ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. ట్రావిస్ హెడ్ (67), క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) దూకుడుగా ఆడారు. 

అనంతరం, 287 పరుగుల ఛేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టుగా పోరాడింది. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ సంజు శాంసన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నంత సేపు రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించేలా అనిపించింది. ఓ దశలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టును వీరిద్దరూ ముందుండి నడిపించారు. 4వ వికెట్ కు ఏకంగా 111 పరుగులు జోడించి సన్ రైజర్స్ ను భయపెట్టారు. 

శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 66 పరుగులు చేయగా... జురెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 70 పరుగులు చేశాడు. అయితే, శాంసన్ ను హర్షల్ పటేల్ అవుట్ చేయగా, జురెల్ వికెట్ ను జంపా తీశాడు. వీరిద్దరూ జట్టు స్కోరు 161 పరుగుల వద్దే వెనుదిరగడం రాజస్థాన్ రాయల్స్ ను దెబ్బతీసింది. 

చివర్లో హెట్మెయర్ (23 బంతుల్లో 42), శుభమ్ దూబే (11 బంతుల్లో 34 నాటౌట్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఆ పోరాటం సరిపోలేదు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో సిమర్జిత్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, మహ్మద్ షమీ 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు. రాజస్థాన్ టీమ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) తాత్కాలిక సారథి రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11) విఫలమయ్యారు. 

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు పడడంతో ఛేజింగ్ లో విఫలమైంది. అటు, రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఓ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా నిలిచాడు. ఆర్చర్ 4 ఓవర్లు విసిరి ఒక్క వికెట్ కూడా తీయకుండా 76 పరుగులు ఇచ్చాడు.
Sunrisers Hyderabad
Rajasthan Royals
IPL 2025
Ishan Kishan
Sanju Samson
Dhruv Jurel
Jos Buttler
IPL
T20 Cricket
Cricket Match

More Telugu News