ఏపీలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు:మంత్రి నాదెండ్ల మనోహర్
- ధాన్యం కొనుగోళ్లలో చరిత్రాత్మక మైలురాయి చేరామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
- రూ.8003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు
- ధాన్యం డబ్బులను 24 గంటల్లో జమ చేయడం మరో రికార్డని వెల్లడి
రికార్డు స్థాయిలో 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, తూకం, తేమ శాతం విషయంలో ఎలాంటి తేడాలు లేకుండా నిబద్ధతతో కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వం యొక్క పారదర్శక పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. శనివారం సాయంత్రం తెనాలిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
గత ప్రభుత్వం ఏ మిల్లుకు ధాన్యం అమ్మాలనేది కూడా నిర్ణయించేదని, రైతులు మిల్లుల వద్ద రాత్రింబవళ్లు వేచి ఉండాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఎంత చేసినా సరైన మద్దతు ధర లభించేది కాదని, తేమ శాతం పేరుతో రైతులను మోసం చేసేవారని ఆయన విమర్శించారు. ధాన్యం అమ్మినా డబ్బులు ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొనేదని ఆయన అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యల మీద దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రూ.8,003 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, 24 గంటల్లో డబ్బులు చెల్లించడం ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై వైసీపీ వర్గాలు దుష్ప్రచారం చేసినా, వాటిని తిప్పికొట్టామని ఆయన అన్నారు.