Justice Yshwant Varma: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో అగ్నిప్రమాదం... బయటపడిన నోట్ల కట్టలు

Delhi High Court Judges Residence Fire Reveals Undeclared Cash
  • ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో అగ్నిప్రమాదం
  • మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి కనిపించిన నోట్ల కట్టలు
  • అలహాబాద్ హైకోర్టుకు న్యాయమూర్తి వర్మ బదిలీ
  • కొలీజియం సీరియస్ చర్యలకు సిఫార్సు
  • సుప్రీంకోర్టు విచారణకు అవకాశం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత భారీ మొత్తంలో నగదు లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. 

జస్టిస్ యశ్వంత్ వర్మ ఆ సమయంలో ఢిల్లీలో లేరు. అగ్నిప్రమాదం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పివేసిన తర్వాత, అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీనిని అధికారులు ఐటీ లెక్కల్లో చూపించని డబ్బుగా గుర్తించారు.

స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా, వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దీనిపై తీవ్రంగా స్పందించారు. వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన 2021 అక్టోబర్‌లో అలహాబాద్ నంచే ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు.

అయితే, కొలీజియంలోని కొంతమంది సభ్యులు ఈ ఘటనను బదిలీతో వదిలేస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతుందని అభిప్రాయపడ్డారు. జస్టిస్ వర్మను రాజీనామా చేయమని అడగాలని, నిరాకరిస్తే పార్లమెంటు ద్వారా తొలగించేందుకు సిఫార్సు చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగ న్యాయస్థానం న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు 1999లో సుప్రీంకోర్టు ఒక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే ప్రధాన న్యాయమూర్తి సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ కోరుతారు. ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
Justice Yshwant Varma
Delhi High Court
Fire Incident
Undeclared Cash
Supreme Court Collegium
Sanjeev Khanna
Allahabad High Court
Judicial Transfer
India
Indian Judiciary

More Telugu News