తిరుమల అన్నప్రసాద వితరణకు నారా కుటుంబం రూ.44 లక్షల విరాళం

  • తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు
  • శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన నారా కుటుంబం
  • అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన కుటుంబ సభ్యులు
నారా దేవాన్ష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా కుటుంబం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సీఎం నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌, ఇతర కుటుంబ సభ్యులకు మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. 

ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను చంద్రబాబు నాయుడి కుటుంబం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చింది. ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈఓ జె.శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, పలువురు టీటీడీ బోర్డు సభ్యులతో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

TTD
Chandrababu
Nara Lokesh
Nara Brahmani
Nara Devansh
Tirumala
Sri Venkateswara Swamy
Annadanam
Donation
Andhra Pradesh

More Telugu News