కేంద్ర సహాయ మంత్రి కుటుంబంలో విషాదం... చిన్న కారణంతో మేనల్లుడి హత్య

  • బీహార్ లో ఘటన
  • మంచినీళ్ల గ్లాసు విషయంలో గొడవ 
  • ఒకరిపై ఒకరు కాల్పులు జరిపిన మంత్రి మేనల్లుళ్లు
  • ఒకరి మృతి... మరొకరికి గాయాలు
  • అడ్డుకోబోయిన తల్లికి బుల్లెట్ గాయం... పరిస్థితి విషమం 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్ భాగల్‌పుర్‌లోని జగత్‌పుర్ గ్రామంలో గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఆయన మేనల్లుడు ఒకరు మృతి చెందగా, మరొక మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. 

వివరాల్లోకి వెళితే, నిత్యానందరాయ్ బావ రఘునందన్ యాదవ్ కుమారులైన జైజిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్ ల మధ్య మంచి నీళ్ల గ్లాసు విషయంలో వివాదం మొదలైంది. ఇంట్లో పనిచేసే వ్యక్తి నీటిని అందించే సమయంలో జరిగిన చిన్న పొరపాటు ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. 

ఈ ఘటనలో విశ్వజిత్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. జైజిత్ యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరినీ ఆపడానికి ప్రయత్నించిన తల్లికి కూడా బుల్లెట్ గాయమైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



More Telugu News