టీడీపీని ఈయనే గెలిపించాడంట... నాశనానికి ముందు ఇలాంటి గర్వమే వస్తుంది: కేఏ పాల్

  • ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశం
  • టీడీపీని తామే నిలబెట్టామన్న పవన్
  • అహంకారం తలకెక్కిందన్న కేఏ పాల్
  • పవన్ మాటలు వింటుంటే తనకే సిగ్గేసిందని వెల్లడి
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల జయకేతనం సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని తామే నిలబెట్టామని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలపై మౌనంగానే ఉంటున్నా, సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. 

"తెలుగుదేశం పార్టీని ఈయనే గెలిపించాడంట. అరే... బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ... 45 శాతం ఓట్లు ఉన్న తెలుగుదేశం పార్టీని ఈయన గెలిపించాడంట. టీడీపీని గెలిపించానని నేనే ఎప్పుడూ చెప్పుకోలేదు. 2014లో 18 మీటింగులు పెట్టి వారికి 5 శాతం ఓట్లేయించాను. నేను చంద్రబాబుకు క్యాంపెయిన్ చేయకపోతే జగన్ సీఎం అయ్యేవాడు. 

ఇప్పుడు టీడీపీని పవనే గెలిపించాడంట, బీజేపీని కూడా ఈయనే గెలిపించాడంట. ఆయన మాటలు వింటుంటే నాకు సిగ్గేస్తోంది. టీవీ ముందు కూర్చుని పవన్ ప్రసంగం చూస్తున్నప్పుడు ఏంచేయాలో అర్థం కాలేదు. నాశనం అయ్యే ముందు గర్వం వస్తుంది అని బైబిల్ లో ఉందన్న విషయం గుర్తొచ్చింది. ఈయన నాశనం అవడానికే ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా అనిపించింది" అంటూ కేఏ పాల్ విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఇక పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అంశాన్ని కూడా కేఏ పాల్ ప్రస్తావించారు. "పవన్ వాళ్ల అన్నయ్య వర్మ పేరెత్తకుండా మీ ఖర్మ అన్నారు. పవన్ కోసం వర్మ పిఠాపురంలో ఎంత కష్టపడ్డాడో తెలియదా? వాళ్ల మాటలు నమ్మి తాను పోటీ చేయకుండా, పవన్ ను లక్ష ఓట్లతో గెలిపించాడు. అలాంటి వ్యక్తిని అవమానిస్తారా? ఎన్నికలు అయిపోయాక మీరే నన్ను గెలిపించారని వర్మతో అన్న పవన్ కల్యాణ్... ఇప్పుడు వర్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇంత అవినీతా... ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా?" అంటూ మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడారని పాల్ విమర్శించారు. పవన్ కల్యాణ్ మాటల్లో స్థిరత్వం లేదని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటంపైనా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో పవన్ కల్యాణ్ నాస్తికుడినని చెప్పుకున్నారని, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. అలాగే, తన తండ్రి రామనామం జపించేవారని పవన్ కల్యాణ్ చెప్పడం కూడా అవాస్తవమని, గతంలో తన తల్లి దీపం వెలిగిస్తే, తన తండ్రి ఆ దీపంతో సిగరెట్లు వెలిగించుకునేవారని చెప్పారని గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ పుట్టినప్పుడు నొప్పి లేకుండా పుట్టాడన్న మెగా బ్రదర్ వ్యాఖ్యలను కూడా పాల్ తప్పుబట్టారు. ఒక తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి ఎన్నో కష్టాలు పడుతుందని, అలాంటి తల్లిని అవమానించడం సరికాదని హితవు పలికారు. మోదీ పుట్టినప్పుడు కూడా ఇలాగే తల్లికి నొప్పులు లేకుండానే పుట్టాడని ప్రచారం చేశారని విమర్శించారు.

హిందీ భాష గురించి పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా పాల్ ప్రస్తావించారు. హిందీ భాష మనకు వద్దని, మాతృభాషల్లో చిచ్చు పెట్టొద్దని గతంలో అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు హిందీ భాష కావాలని మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషను కాదని హిందీ భాషను ప్రోత్సహించడం సరికాదన్నారు.

చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చడం సరికాదని పాల్ అన్నారు. పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని, రోజుకో మాట మార్చే వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు పామును పెంచినట్టు దత్తపుత్రుడిని పెంచుతున్నారని, ఇప్పుడు ఆ పాము పెంచినవాళ్లనే మింగే స్థాయికి ఎదిగిందని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి తనను కలిస్తే ఏడు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని, రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని పాల్ అన్నారు.

క్షమాపణ అడిగిన వారిని యేసు ప్రభువు క్షమిస్తారని, తప్పు చేసినప్పుడు పవన్ కల్యాణ్ క్షమాపణ అడగాలని పాల్ అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.



More Telugu News

Pawan Kalyan KA Paul TDP Janasena Chandrababu Naidu BJP Andhra Pradesh Politics SVSSN Varma Political Controversy Religious Remarks