Soundarya: మోహన్ బాబు గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు: సినీ నటి సౌందర్య భర్త

- సౌందర్య ఆస్తులను మోహన్ బాబు స్వాధీనం చేసుకోలేదన్న రఘు
- తమ మధ్య ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని వెల్లడి
- ఇప్పటికీ ఆయనతో తమకు మంచి స్నేహం ఉందని వ్యాఖ్య
సినీ నటి సౌందర్యకు సంబంధించి నటుడు మోహన్ బాబుపై పలు వార్తలు ఇటీవలి కాలంలో తెరపైకి వస్తున్నాయి. సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదని... ఆమెను పక్కాగా ప్లాన్ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల నిరసనకు దిగారు. మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలో ఉన్న ఫామ్ హౌస్ ని కూడా తన అదుపులో ఉంచుకుని మోహన్ బాబు అనుభవిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సౌందర్య భర్త రఘు స్పందించారు.
హైదరాబాద్ లోని ఒక ప్రాపర్టీ గురించి మోహన్ బాబు పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని రఘు చెప్పారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని అన్నారు. తన భార్య సౌందర్య ఆస్తులను మోహన్ బాబు చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. మోహన్ బాబుకు, తమకు మధ్య ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని అన్నారు.
తన భార్య, అత్త, బావమరిది ఆయనతో మంచిగా ఉండేవారని తెలిపారు. సౌందర్య మరణించిన తర్వాత కూడా... ఆయనతో తమకు మంచి స్నేహం ఉందని చెప్పారు. మోహన్ బాబుపై అసత్య వార్తలు వస్తున్న నేపథ్యంలోనే తాను అసలు విషయాలు ఏమిటో చెప్పాలనుకున్నానని తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురించవద్దని కోరారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రఘును 2003లో సౌందర్య పెళ్లి చేసుకున్నారు. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున సౌందర్య ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి కరీంనగర్ కు బయల్దేరిన వెంటనే హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆమె సజీవదహనం అయ్యారు.