Ashok Babu: వైసీపీ పాలనలో సాక్షి పత్రికకు చేకూరిన లబ్ధిపై శాసనమండలిలో చర్చ

Discussion in Legislative Council on Benefits Received by Sakshi Newspaper
  • సాక్షి'కి అక్రమంగా లబ్ధి చేకూర్చారని అశోక్ బాబు ఆరోపణ
  • అలవెన్సుల ద్వారా 'సాక్షి'కి లబ్ధి చేకూరిందని ఆరోపణ
  • ప్రభుత్వ జీతాలు పొందిన 'సాక్షి' ఉద్యోగులను తొలగించామన్న మంత్రి పార్థసారథి
  • సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ
వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, కేవలం సాక్షి పత్రికకు మాత్రమే అయాచిత లబ్ధి చేకూర్చారని శాసనమండలిలో టీడీపీ సభ్యుడు అశోక్ బాబు ఆరోపించారు. సాక్షి పత్రికలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వంలో ప్రత్యేకంగా పోస్టులు సృష్టించి జీతాలు చెల్లించారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణ ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

గత ఐదేళ్లలో సాక్షి పత్రికకు I&PR ద్వారా మొత్తం 196 కోట్ల రూపాయలు చెల్లించారని ఆయన వెల్లడించారు. అయితే, తమ సమాచారం ప్రకారం సాక్షికి మొత్తం 400 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరిందని అశోక్ బాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఒక వార్తా పత్రికను తీసుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఆ నిబంధనలు సాక్షి పత్రికకు మాత్రమే వర్తించేలా చేశారని అశోక్ బాబు ఆరోపించారు. దీనివల్ల సాక్షి పత్రికకు ఒక్కసారిగా ఐదు లక్షల కాపీల వరకు సర్క్యులేషన్ పెరిగిందని ఆయన అన్నారు. ఈ జీవో ద్వారా ఎవరు లబ్ధి పొందారు, ఏ డైలీకి ఎక్కువ సబ్ స్క్రిప్షన్లు వెళ్లాయి, ఎందుకు వెళ్లాయి అనే దానిపై ప్రభుత్వం విచారణ చేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాకుండా, సాక్షి పత్రికలో పనిచేసిన అనేక మంది ఉద్యోగులకు గత ప్రభుత్వంలో సలహాదారులుగా లేదా ఇతర హోదాల్లో ఉద్యోగాలు ఇచ్చి జీతాలు చెల్లించారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని ఆయన అడిగారు. ఇన్ని కోట్ల రూపాయలు ఒక పత్రికకు ఇవ్వడంలో అధికారుల పాత్ర ఏమిటి, ఇది ఎలా జరిగిందనే దానిపై కూడా విచారణ జరిపి, వివరాలు సభకు తెలియజేయాలని ఆయన కోరారు.

దీనికి సమాధానంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ, ఇది నిజమేనని, దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచక్షణ అధికారాలను ఉపయోగించి, ఇతర పత్రికలతో పోలిస్తే సాక్షి పత్రికకు ఎక్కువ లబ్ధి చేకూర్చినట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. దీనిపై తప్పకుండా విచారణ జరుపుతామని, అధికారులు ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సాక్షి పత్రికలో పనిచేసిన కొంతమందిని డిజిటల్ కార్పొరేషన్, I&PR వంటి సంస్థల్లో నియమించారని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని తొలగించామని ఆయన తెలిపారు. సోషల్ మీడియా ద్వారా చెల్లింపులు జరిగిన మాట వాస్తవమేనని, వారందరినీ తొలగించామని ఆయన స్పష్టం చేశారు.

వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు నెలకు 200 రూపాయలు అలవెన్సుగా ఇచ్చారని, దీని ద్వారా నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. దాదాపు 144.6 కోట్ల రూపాయలను వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి చెల్లించారని, ఈ డబ్బుతో సాక్షి పత్రిక ప్రతులనే కొన్నారన్న సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.
Ashok Babu
Kolusu Parthasarathy
AP Assembly Session
Sakshi

More Telugu News