Rambha: రంభ మళ్లీ వస్తోంది...!

- 1992లో వెండితెరకు పరిచయమైన రంభ
- ఆ ఒక్కటి అడక్కు చిత్రం రంభకు మొదటి సినిమా
- 2008లో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన భామ
- 2010లో కెనడా బిజినెస్ మేన్ తో వివాహం
- ప్రస్తుతం టీవీషోలు చేస్తున్న రంభ
- సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ
రంభ... బొద్దుగా, అందంగా దక్షిణాది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండే ఈ తెలుగు కథనాయిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి కుర్రకారును ఓ ఊపు ఊపింది. 1992లో రాజేంద్రప్రసాద్ సరసన 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రం ద్వారా రంభ వెండితెర అరంగేట్రం చేసింది. ఆమె చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది 2008లో.
కెరీర్ చివర్లో రంభ కొన్ని ఐటమ్స్ సాంగ్స్ లోనూ తళుక్కుమంది. 2010లో కెనడా బిజినెస్ మేన్ ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకున్న రంభ సినిమాలకు దూరమైంది. భర్త, పిల్లలతో కుటుంబ జీవితంలో బిజీగా ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ కు రంభ సిద్ధమవుతోంది.
పలు టీవీ షోల ద్వారా బుల్లితెరపై కనిపిస్తున్నప్పటికీ, రంభ మరోసారి వెండితెరపై కనిపించనుందన్న వార్త అభిమానులను సంతోషానికి గురిచేస్తోంది. అయితే, నిజంగానే రంభ రీఎంట్రీ ఇస్తోందా? లేక అవన్నీ ఊహాగానాలేనా? అనే సందేహాలకు తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల రంభ భర్త తనను కలిశారని, రంభకు ఏదైనా చాన్స్ ఉంటే ఇవ్వాలని కోరారని థాను వెల్లడించారు. ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభమైతే కచ్చితంగా రంభకు అవకాశం ఇస్తానని చెప్పానని వివరించారు. ప్రస్తుతం రంభ ఆర్థికంగా స్థిరపడ్డారని, ఆమె భర్త కూడా బడా బిజినెస్ మేన్ అని థాను తెలిపారు.
కాగా, రంభ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, బెంగాలీ, భోజ్ పురి, ఇంగ్లీష్ భాషల్లోనూ నటించడం విశేషం. ప్రస్తుతం తమిళంలో 'స్టార్ విజయ్' చానల్లో ప్రసారమయ్యే 'జోడీ ఆర్ యూ రెడీ-సీజన్2' కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.