Swarnalatha: నగల కోసమే అమ్మను హత్య చేశారు: సింగర్ స్వర్ణలత తనయుడు అనిల్ రాజు

- గాయనిగా స్వర్ణలతకు మంచి పేరు
- హాస్యగీతాలు ఎక్కువగా పాడేవారన్న తనయుడు
- తమది శ్రీమంతుల కుటుంబమని వెల్లడి
- బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించేవారని వివరణ
తెలుగు సినిమా తొలినాళ్లలో గాయనిగా పేరు తెచ్చుకున్నవారి జాబితాలో స్వర్ణలత కూడా కనిపిస్తుంది. ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, జిక్కి, లీల, ఏపీ కోమల వంటి వారితో కలిసి ఆమె అనేక పాటలు పాడారు. ముఖ్యంగా ఆమె హాస్యనటి గిరిజకు ఎక్కువ పాటలు పాడారు. స్వర్ణలత తనయుడు అనిల్ రాజు తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆమె గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మా అమ్మగారు వాళ్లు చిన్నప్పటి నుంచి శ్రీమంతులే. మా తాతగారి వాళ్లకి 200 ఎకరాలపైన ఉండేది. అందువలన అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా బంగారు ఆభరణాలను విపరీతంగా ధరించేవారు. అమ్మ అసలు పేరు 'మహాలక్ష్మి'. అయితే ఆమె బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరించడం చూసి, నటుడు కస్తూరి శివరావుగారు 'స్వర్ణలత' అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే ఆమె పాప్యులర్ అయ్యారు" అని చెప్పారు.
"మద్రాస్ లోని 'భోగ్' రోడ్ లో మాకు చాలా పెద్ద బంగ్లా ఉండేది. ఇటీవలే ఆ ఇంటిని 100 కోట్లకు అమ్మేశాము. ఆ ఇంట్లో మాకు 3 ఖరీదైన కార్లు ఉండేవి. అమ్మగారు అమెరికాలో 6 నెలలు... ఇండియాలో 6 నెలలు ఉండేవారు. ఒకసారి అమ్మ అమెరికా నుంచి వచ్చాక... నేను, ఆమె కలిసి కార్లో మద్రాస్ నుంచి హైదరాబాద్ బయలుదేరాము. రాత్రి ఒంటిగంటవేళ మా కారుపై కొందరు దాడిచేశారు. మమ్మల్ని గాయపరిచి ఆమె నగలను దోచుకెళ్లారు. 5 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్న అమ్మ, తన పుట్టినరోజు నాడే చనిపోయింది" అని చెప్పారు.