KTR: రేవంత్ రెడ్డికి కనీసం మానవత్వం లేకుండా పోయింది: కేటీఆర్ ఆగ్రహం

KTR fires at Revanth Reddy government
  • ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతిపై కేటీఆర్ విచారం
  • గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శ
  • గురుకులాల్లో వరుస మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అన్న కేటీఆర్
గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణ మృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కనీసం మానవత్వం లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య చక్రం అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. కళ్ల ముందు విగతజీవిగా పడి ఉన్న బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారని, వారిని ఓదార్చాల్సింది పోయి, పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు.

రోజురోజుకూ ప్రజల దృష్టిలో దిగజారిపోవడమే కాకుండా, కనికరం కూడా లేకుండా ప్రవర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఈ దాష్టీకానికి విద్యా శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత అన్నారు. హోంమంత్రిగా కూడా ఆయన విఫలమయ్యారని అన్నారు. 14 నెలల కాలంలోనే రాష్ట్రంలోని గురుకులాల్లో 83 మంది విద్యార్థులు బలికావడం దేశ చరిత్రలో చీకటి అధ్యాయమన్నారు.

ముఖ్యమంత్రి పూర్తి అసమర్థత వల్ల జరుగుతున్న ఈ వరుస మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కనీసం మంచి భోజనం పెట్టడం చేతకాని ప్రభుత్వం... చివరకు వారి ప్రాణాలను తీసిందని అన్నారు.
KTR
Telangana
BRS
Revanth Reddy

More Telugu News