Kalpana: తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన గాయని కల్పన

- సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని ఆపాలని కోరిన కల్పన
- తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హామీ
సామాజిక మాధ్యమాలలో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టడం నిరోధించాలని గాయని కల్పన తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆపాలని ఆమె కోరారు. గాయని కల్పన ఇటీవల నిద్రమాత్రలను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే ఆమె భర్త, కూతురు కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం జరిగింది.
సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వేదికగా కల్పన ఆరోగ్యంపై వివిధ రకాలుగా కథనాలు వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యాయత్నం చేశారంటూ వార్తలు రావడంతో ఆమె మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె మహిళా కమిషన్‌ను కోరారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.