Daggubati Venkateswararao: ఈ పుస్తకం రాయడానికి చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Prapancha Charitra book penned by Daggubati Venkateswararao launched in Visakha
  • ప్రపంచ చరిత్ర పేరిట పుస్తకం రాసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 
  • నేడు విశాఖలో పుస్తకావిష్కరణ
  • హాజరైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన 'ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు విశాఖలో ఏర్పాటు చేశారు. ఇక్కడి గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. 

అంతకుముందు, దగ్గుబాటి వెంకటేశ్వరావు ప్రసంగిస్తూ... ఈ పుస్తక రచనకు ముందు చాలా కృషి జరిగిందని చెప్పారు. తాను సైన్స్ విద్యార్థినని, ఎంబీబీఎస్ చదివానని వెల్లడించారు. తనకు సాంఘిక శాస్త్రం గురించి పెద్దగా తెలియదని అన్నారు. చరిత్ర తెలియకుండా పుస్తకం రాయడం ఎలా అని ఆలోచించానని, దాంతో విస్తారంగా పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నానని దగ్గుబాటి చెప్పారు. అక్కడ్నించి పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనేవాడ్నని, గొప్ప నాయకుల చరిత్రలు కూడా చదవడం మొదలుపెట్టానని వివరించారు. 

కాగా, ఈ కార్యక్రమ వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. గతంలో ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు రావడం, దగ్గుబాటి టీడీపీకి దూరం కావడం తెలిసిందే. కాలక్రమంలో ఆయన వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల పుస్తకావిష్కరణ కోసం ఆహ్వానించేందుకు ఆయన చంద్రబాబు నివాసానికి రావడం చర్చనీయాంశం అయింది.
Daggubati Venkateswararao
Prapancha Charitra
Bool Launch
Visakhapatnam

More Telugu News