Chandrababu: త్రిభాషా విధానంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Andhra pradesh CM Chandrababu Sensational Comments On Three Languages Concept
  • హిందీ నేర్చుకుంటే తప్పేమిటన్న ఏపీ సీఎం
  • భాష అనేది కమ్యూనికేషన్ కోసం ఉద్దేశించిన సాధనమని వెల్లడి
  • నియోజకవర్గాల పునర్విభజన దేశ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్య
భాష అనేది కమ్యూనికేషన్ కోసం ఉద్దేశించిన ఓ సాధనమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మాతృభాషతో పాటు అంతర్జాతీయ భాషగా ఇంగ్లిష్ ను, దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీని నేర్చుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. జ్ఞానాన్ని సంపాదించడం మాతృభాష ద్వారా మాత్రమే సాధ్యమని అంగీకరిస్తామని చెబుతూనే, ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదన్నారు. కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానాన్ని సమర్థిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 

అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళనను చంద్రబాబు తోసిపుచ్చారు. డీలిమిటేషన్ అనేది దేశ ప్రయోజనాల కోసమేనని, ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన అవసరం ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వేరే రాజకీయ ప్రయోజనాలు ఏవీ లేవని తేల్చిచెప్పారు. 

స్టాలిన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. నియోజకవర్గ పునర్విభజన ఇప్పుడు అత్యవసరమని అన్నారు. దేశంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై తానే తొలుత చర్చను ప్రారంభించానని తెలిపారు. సరిహద్దు నిర్ధారణ నిరంతర ప్రక్రియ అని, ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని, సరిహద్దు విభజన, జనాభా నిర్వహణ భిన్నమైనవని చెప్పారు. ఏపీలోని యూనివర్సిటీలలో పది విదేశీ భాషలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన దేశానికి వెళ్లి పని చేసుకునే సౌలభ్యం కలుగుతుందని వివరించారు.
Chandrababu
MK Stalin
NEP
AP CM
Hindi

More Telugu News