Singer Kalpana: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం ఇదేనట..!

- పెద్ద కూతురుతో కల్పన గొడవపడ్డట్లు ప్రచారం
- హైదరాబాద్ రమ్మని కూతురిని పిలిచిన కల్పన
- రాలేనని చెప్పడంతో మనస్తాపం చెందిన సింగర్
ప్రముఖ సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం కూతురుతో గొడవేనని సమాచారం. కల్పన పెద్ద కూతురు కేరళలో ఉంటోంది. మంగళవారం కూతురుకు ఫోన్ చేసిన కల్పన.. ఆమెను హైదరాబాద్ రావాలని కోరింది. అయితే, కేరళలోనే ఉంటానని, హైదరాబాద్ కు రానని కూతురు తెగేసి చెప్పినట్లు సమాచారం.
ఈ విషయంపై ఫోన్లో తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కూతురితో గొడవతో మనస్తాపం చెందిన కల్పన.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు చెన్నై నుంచి భర్త ప్రసాద్ ఫోన్ చేయగా కల్పన లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో విల్లా సెక్రటరికి కాల్ చేసి చెప్పానని, ఆయన వెళ్లి తలుపు తట్టినా తెరవలేదని ప్రసాద్ వివరించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారని, బెడ్ రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారని ఆయన తెలిపారు.