- ఓటీటీలో తెలుగు .. తమిళ .. మలయాళ హిట్ చిత్రాలు
- ఈ నెల 7న నెట్ ఫిక్స్ కి రానున్న 'తండేల్'
- అదే రోజున సోనీ లివ్ లోకి అడుగుపెడుతున్న 'రేఖా చిత్రం'
- జీ 5 ప్రేక్షకులను పలకరించనున్న 'కుడుంబస్థాన్'
ఈ వారం ఓటీటీ సెంటర్లలో కాస్త గట్టిగానే సందడి కనిపించనుంది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఈ వారం ప్రేక్షకులను పలకరించనున్నాయి. నాగచైతన్య - సాయిపల్లవి ప్రధానమైన పాత్రలను పోషించిన 'తండేల్' ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 7వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక మలయాళంలో జనవరి 9వ తేదీన విడుదలైన 'రేఖా చిత్రం' సంచలన విజయాన్ని నమోదు చేసింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ఇది. అసిఫ్ అలీ - అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, మమ్ముట్టి అతిథి పాత్రలో కనిపిస్తారు. కేవలం 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 25 రోజులలో 75 కోట్లను వసూలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. జోఫిన్ చాకో దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక తమిళంలో తాజా హిట్ గా నిలిచిన సినిమా 'కుడుంబస్థాన్'. మణికందన్ - శాన్వి మేఘన జంటగా నటించిన ఈ సినిమా, జనవరి 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. 8 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, పాతిక కోట్ల వరకూ వసూలు చేయడం విశేషం. వైశాఖ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదే రోజున జియో హాట్ స్టార్ లో 'బాపు' స్ట్రీమింగ్ కానుండగా, ఈ నెల 6వ తేదీన ఈటీవీ విన్ లో 'ధూం ధాం' స్ట్రీమింగ్ కానుంది.