Serbia Parliament: సెర్బియా పార్లమెంటులో పొగబాంబులతో రణరంగం

at least 3 serbian lawmakers injured as smoke bombs and flares thrown in parliament
  • సెర్బియా పార్లమెంట్‌లో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదంతో ఉద్రిక్తత 
  • ప్రధాని రాజీనామా ఆమోదించాలంటూ విపక్షాల పట్టు
  • ఘర్షణలో ముగ్గురు సభ్యులకు గాయాలు
సెర్బియా ప్రధాన మంత్రి మిలోస్ పుచెవిచ్ రాజీనామాను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో విపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్మోక్ బాంబులు విసరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పార్లమెంటులో సభ్యులు కోడిగుడ్లు, నీళ్ల బాటిళ్లు కూడా విసురుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘర్షణలో ముగ్గురు ఎంపీలకు గాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. సెర్బియాలోని నోవీసాడ్ నగరంలో గత నవంబర్‌లో ఓ రైల్వే స్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది మృతి చెందారు. అప్పటి నుంచి విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థుల ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు సహా అనేక రంగాలకు చెందిన వారు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఉద్యమ తీవ్రతకు తలొగ్గిన ప్రధాన మంత్రి మిలోస్ పుచెవిచ్ ఇటీవల రాజీనామా చేశారు.

ప్రధాన మంత్రి రాజీనామాను 30 రోజుల్లో ఆమోదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా మధ్యంతర ఎన్నికలు జరిపించడమా? అనేది తేల్చాల్సి ఉంది. అయితే పార్లమెంటులో ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోపక్క పార్లమెంటులో యూనివర్సిటీ విద్యకు నిధులు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలో అనేక నిర్ణయాలను ఆమోదించే యోచనలో అధికార పార్టీ ఉందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. ఇది చట్ట విరుద్ధమని, ప్రధాని మిలోస్ రాజీనామాను వెంటనే ఆమోదించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. బ్యానర్లు చేబూని నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఈ తరుణంలో పార్లమెంటు లోపల స్మోక్ బాంబులు విసరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఘటనలో ముగ్గురు సభ్యులు గాయపడ్డారు. ఈ పరిణామాలపై స్పీకర్ బ్రనాబిక్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలను ఉగ్రవాద ముఠాలుగా అభివర్ణించారు. 
Serbia Parliament
Lawmakers Injured
Smoke Bomb
international News

More Telugu News