డ్రైవ‌ర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

  • వేధిస్తున్నాడ‌ని డ్రైవ‌ర్‌కు దేహ‌శుద్ధి చేసిన‌ అస్సాం మాజీ సీఎం ప్ర‌ఫుల్ల కుమార్ మ‌హంత కూతురు
  • డ్రైవ‌ర్‌ను మోకాళ్ల‌పై కూర్చొబెట్టి చెప్పుతో కొట్టిన వైనం
  • సోమ‌వారం నాడు దీస్ పూర్‌లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్‌లో ఘ‌ట‌న‌
  • ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
అస్సాం మాజీ ముఖ్య‌మంత్రి ప్ర‌ఫుల్ల కుమార్ మ‌హంత కూతురుకు సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఆమె ఓ వ్య‌క్తిని మోకాళ్ల‌పై కూర్చొబెట్టి చెప్పుతో కొట్ట‌డం క‌నిపిస్తోంది. దీస్ పూర్‌లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్‌లో సోమ‌వారం నాడు ఈ సంఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. 

అస‌లేం జ‌రిగిందంటే..!
స‌ద‌రు వ్య‌క్తి త‌న తండ్రి వద్ద గ‌త కొన్నేళ్లుగా డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్న‌ట్లు మ‌హంత కుమార్తె తెలిపారు. అయితే, నిత్యం మ‌ద్యం మ‌త్తులో ఉండే అత‌డు త‌న‌తో దుర్భాష‌లాడుతూ దురుసుగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని ఆమె ఆరోపించారు. ఈ విష‌య‌మై ప‌లుమార్లు అత‌డిని హెచ్చ‌రించిన‌ప్పటికీ, అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మాత్రం మార్పు రాలేదన్నారు.  

సోమ‌వారం కూడా అత‌డు పూటుగా మ‌ద్యం సేవించి వ‌చ్చి, త‌న ఇంటి త‌లుపులు కొట్టాడ‌ని మ‌హంత కూతురు తెలిపారు. అందుకే ఇలా దేహ‌శుద్ధి చేసిన‌ట్లు చెప్పారు. అయితే, స‌ద‌రు డ్రైవ‌ర్‌పై ఇన్నాళ్లూ ఎందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌నే ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.  

ఇదిలాఉంటే.. అస్సాం గ‌ణ ప‌రిష‌త్ (ఏజీపీ) మాజీ అధ్య‌క్షుడైన ప్ర‌ఫుల్ల కుమార్ మ‌హంత ఆ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. 1985-90, 1996-2001 రెండు ద‌ఫాలు అస్సాం సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.


More Telugu News