Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట కోర్టు

- చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత ఫిర్యాదు
- కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కోర్టులో హాజరు పరచడంతో ఈ నెల 13 వరకు రిమాండ్ విధింపు
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట కోర్టు పది రోజుల రిమాండ్ విధించింది. పోసానిని ఇటీవల హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు అతనిని ఏపీకి తరలించారు.
మరోవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేత కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు ఇవాళ పీటీ వారెంట్ పై పోసానిని అదుపులోకి తీసుకున్నారు.
పోసానిని ఈరోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లిలో నమోదైన కేసులో రాజంపేట జైలులో ఉన్న పోసానిపై ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.