గంజాయి లభ్యం... ఐఐటీ బాబాను అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత విడుదల చేసిన పోలీసులు!

  • జైపూర్‌లో కొందరు వ్యక్తులతో ఐఐటీ బాబా గొడవ
  • విచారణలో భాగంగా ఐఐటీ బాబా వద్ద గంజాయిని గుర్తించిన పోలీసులు
  • అనుమతించదగిన పరిమితిలో గంజాయి ఉండటంతో విడుదల చేసిన పోలీసులు
ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబాగా పాపులరైన అభయ్ సింగ్‌పై రాజస్థాన్ పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఆయన వద్ద గంజాయి అనుమతించదగిన పరిమితిలో ఉండటంతో కొన్ని గంటల తర్వాత విడుదల చేసినట్లు తెలిపారు.

జైపూర్‌లో కొందరు వ్యక్తులతో ఐఐటీ బాబా గొడవకు దిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఐఐటీ బాబా వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత విడుదల చేసినట్లు వెల్లడించారు.

తాను ఎవరితోనూ తగాదాకు వెళ్లలేదని, తన అనుచరులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నానని ఐఐటీ బాబా పోలీసులకు తెలిపారు. 

హర్యానాకు చెందిన ఐఐటీ బాబా ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. కార్పోరేట్ కంపెనీలో పని చేసిన అతను, ఆ తర్వాత ఉద్యోగం వదిలేశారు. ఈ క్రమంలో ఆధ్యాత్మికం వైపు మరలిన ఐఐటీ బాబా, కుంభమేళాకు రావడంతో పాపులర్ అయ్యారు.


More Telugu News