బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ప్రకటన
- బతికున్నంత కాలం రాజకీయ వారసుడిని ప్రకటించనన్న మాయావతి
- కుటుంబం కంటే పార్టీయే ముఖ్యమని వెల్లడి
- పార్టీ విధానాలకు హాని కలిగించేలా వ్యవహరిస్తే వెంటనే తొలగిస్తామని హెచ్చరికలు
లక్నోలో ఆదివారం జరిగిన పార్టీ అఫీస్ బేరర్ల సమావేశంలో మాయావతి కీలక ప్రకటనలు చేశారు. తాను బతికున్నంత వరకూ పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండరని ఆమె స్పష్టం చేశారు. మార్చి 15న నిర్వహించనున్న పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు. కాన్షీరామ్ సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ నిబద్ధతతో పాటిస్తుందని చెప్పిన మాయావతి.. తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని పేర్కొన్నారు.
పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. బీఎస్పీని రెండు వర్గాలుగా చీల్చి బలహీన పరిచే ప్రయత్నం చేసిన ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను గత నెల పార్టీ నుంచి బహిష్కరించామని, ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్‌ను సైతం పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్లు వివరించారు.