Crime News: సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం

Woman congress worker body found in suitcase in Rohtak
  • హర్యానాలోని రోహ్‌తక్‌లో ఘటన
  • సంప్లా బస్టాండ్‌లో ఓ పెద్ద సూట్‌కేసులో గుర్తింపు
  • ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న కాంగ్రెస్
  • అత్యున్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్
హర్యానాలోని రోహ్‌తక్‌లో ఓ సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. శుక్రవారం సంప్లా బస్‌‌స్టాండ్‌లో ఓ పెద్ద సూట్‌కేసులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలికి 20 నుంచి 22 ఏళ్లు ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. మెడచుట్టూ స్కార్ఫ్ ధరించగా, చేతులకు గోరింటాకు పెట్టుకుంది. ఆమెను హత్య చేసి ఇలా రోడ్డుపై వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మృతురాలు తమ పార్టీ కార్యకర్త అని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ భూషణ్ బాత్రా మాట్లాడుతూ.. బాధిత యువతి హిమానీ నర్వాల్ అని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో భూపీందర్ హుడా, దీపీందర్ హుడాలతో కలిసి చురుగ్గా ప్రచారం చేసినట్టు తెలిపారు. 

కాంగ్రెస్ హర్యానా అధ్యక్షుడు భూపీందర్ సింగ్ హుడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయిలో, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.  
Crime News
Congress Worker
Rohtak
Himani Narwal

More Telugu News