చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లపై సందిగ్ధత.. దుబాయ్‌కి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా

  • గ్రూప్-బీ నుంచి సెమీస్‌కు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా
  • గ్రూప్-ఏ నుంచి న్యూజిలాండ్, ఇండియా సెమీస్‌కు
  • నేడు భారత్-కివీస్ మధ్య చివరి లీగ్ మ్యాచ్
  • ఈ మ్యాచ్ ఫలితంపైనే సెమీస్‌ వేదికలు, జట్లు ఖరారు
పాకిస్థాన్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. గ్రూప్-బీలో మ్యాచ్‌లు ముగిసినా, గ్రూప్-ఏలో మరో మ్యాచ్ మిగిలి ఉండటంతో సెమీ ఫైనల్ సమీకరణాలపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. దీంతో ఇప్పటికే సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల సెమీస్ వేదికలు ఖరారు కాలేదు. దీంతో పాక్‌లో ఉండాలో, దుబాయ్‌కి వెళ్లాలో తెలియని సందిగ్ధంలో ఇరు జట్లు పడిపోయాయి.

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో గ్రూప్-ఏలో చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఫలితం అనంతరం సెమీస్ వేదికలు, తలపడే జట్లు ఖరారవుతాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడేది ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ ఫలితం వరకు వేచి చూస్తే అటు ఆసీస్, ఇటు సఫారీ జట్ల ట్రైనింగ్‌పై ప్రభావం పడుతుంది. కాబట్టి ఏం చేయాలో పాలుపోని స్థితికి ఇరు జట్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడాల్సి వస్తుందేమోనని ఆస్ట్రేలియా నిన్ననే దుబాయ్ బయలుదేరినట్టు తెలుస్తోంది. సౌతాఫ్రికా మాత్రం నేడు దుబాయ్ వెళ్లనుంది. ఇరు జట్లలో ఒకటి భారత్‌తో తలపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో జట్టు రేపు తిరిగి లాహోర్ చేరుకుంటుంది.

ఈ ప్రయాణాలు జట్ల ట్రైనింగ్ పైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో టోర్నమెంట్ షెడ్యూల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే చోట ఉండి, అవే సౌకర్యాల మధ్య ప్రాక్టీస్ చేయగలిగితే, అదే స్టేడియంలో, ప్రతిసారి ఒకే పిచ్‌పై ఆడగలిగితే అది కచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుందని దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్‌డెర్ డుసెన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. కానీ, ఇప్పుడు ఎవరితో తలపడాల్సి వస్తుందో, ఎక్కడ ఆడాల్సి వస్తుందో తెలియక దుబాయ్, పాకిస్థాన్ మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


More Telugu News