'మ్యాడ్ స్క్వేర్' నచ్చకపోతే టికెట్‌ డబ్బులకి డబుల్‌ ఇస్తాం: హీరో సంగీత్‌ శోభన్‌

  • మ్యాడ్‌ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న 'మ్యాడ్‌ స్క్వేర్'
  • మార్చి 29న విడుదల కాబోతున్న సినిమా 
  • సినిమా సక్సెస్‌పై కాన్ఫిడెన్స్‌ ఉందంటున్న టీమ్‌ 
విజయం సాధించిన వినోదాత్మక చిత్రం 'మ్యాడ్'కు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో రానున్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో చిత్ర బృందం ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చిత్ర బృందం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నార్నే నితిన్‌ మాట్లాడుతూ ''మ్యాడ్‌ చిత్రానికి మించిన వినోదాన్ని 'మ్యాడ్ స్క్వేర్' అందించబోతుంది. థియేటర్లలో ఎవరూ కూడా సీట్లలో కూర్చొని ఉండరు. అంతలా కడుపుబ్బా నవ్వుతారు. తప్పకుండా ఈ చిత్రం అందరికీ మంచి కిక్ ఇస్తుంది'' అన్నారు.

సంగీత్‌ శోభన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన టీజర్‌లో ఉన్న ఫన్ అందరికీ నచ్చింది. అయితే అది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో దానికి మించిన వినోదం ఉంటుంది. మ్యాడ్ పార్ట్-1 విడుదల సమయంలో నిర్మాత వంశీ సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తానని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన మాటగా నేను చెబుతున్నా... ఎవరికీ సినిమా నచ్చకపోయినా టికెట్ డబ్బులకి రెండింతలు ఇస్తాం'' అన్నారు.

మ్యాడ్ సమయంలో ప్రేక్షకుల ఆదరణ చూసి తనకు సంతోషం కలిగిందని, తప్పకుండా ఈ చిత్రం కూడా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని కథానాయకుడు రామ్ నితిన్ తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ''సినిమాలోని ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను నవ్విస్తుంది. మ్యాడ్ సినిమాకు పది రెట్లు వినోదాన్ని ఈ సినిమా అందిస్తుంది. సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది'' అని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హారిక సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు. 






More Telugu News