అలా చేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉండదని నాడు జగన్ అనలేదా?: నారా లోకేశ్

  • శాసనమండలిలో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం
  • వైసీపీకి ప్రతిపక్ష హోదాపై వ్యాఖ్యలు
  • జగన్ నిబంధనలు తెలుసుకోవాలన్న లోకేశ్
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష హోదా గురించి సభ్యులు చర్చకు తెచ్చారని, అయితే, ప్రజాస్వామ్యంలో పార్లమెంటు మార్గదర్శకాలను మనం అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  

ఇందులో లోక్ సభ స్పీకర్ డైరక్షన్స్ లో కండీషన్స్ ఫర్ రికగ్నిషన్ పేజి నెం.62లో 121సి పాయింట్లో టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్షహోదా ఇవ్వాలని స్పష్టంగా ఉందని వెల్లడించారు. కానీ మాజీ ముఖ్యమంత్రికి దీని గురించి తెలియదేమో అని లోకేశ్ ఎద్దేవా చేశారు. 

"2009లో అసెంబ్లీకి సంబంధించి కూడా అటువంటి నిబంధనలే ఉన్నాయి. పేజి నెం.19లో 56వ అంశంలో అదే తరహా నిబంధనలు పొందుపరచబడి ఉన్నాయి. 2019 జూన్ 13న అసెంబ్లీలో చంద్రబాబు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, అయిదుగురిని లాగేస్తే 18 మంది ఉంటారు... అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉండదని సభ సాక్షిగా జగన్ చెప్పలేదా? ఈరోజు ఏవిధంగా మీరు ప్రతిపక్ష హోదా అడుగుతారు?" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.

మేం ఏనాడూ గవర్నర్ పై కాగితాలు విసరలేదు

ప్రభుత్వ విధానాలతో విభేదించి గతంలో పలు సందర్భాల్లో మేం కూడా నిరసన తెలిపాం కానీ... ఇలా గవర్నర్ పై ఎప్పుడూ కాగితాలు విసరలేదు. ఏపీ చరిత్రలో ఇలా చేయడం చరిత్రలో రెండోసారి. గతంలో ఏపీ విభజన సమయంలో అలా జరిగింది. గవర్నర్ ను గౌరవంగా మనం పిలుచుకున్నాం, మన విజ్ఞప్తి మేరకు ఆయన ప్రసంగించారు. 

సమస్యలపై డిబేట్ చేయండి. ఈరోజు వారు (వైసీసీ సభ్యులు) సభలో లేరు... పారిపోవడం కరెక్టు కాదు. వీసీల విషయంలో వారు కోరిన విధంగా ఫైళ్లు తెప్పించి పరిశీలిస్తా, ఆరోపణలు నిజమైతే విచారణ చేపడతాం. స్వప్రయోజనం కోసం తప్ప ప్రజాసమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదు. చిన్న చిన్న తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ, కౌన్సిల్ లో సమస్యలపై చర్చ జరగాలి. 

గవర్నర్ గారి ప్రసంగంలో  సూపర్-6 అంశాన్ని ప్రస్తావించారు. పేజి నెం.2లో ప్రజాసంక్షేమం కోసం సూపర్-6 అమలుచేస్తామని స్పష్టంగా చెప్పారు. పాదయాత్రలో విద్యాపరంగా ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర సాధనకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతాం" అని మంత్రి లోకేశ్  స్పష్టంచేశారు.


More Telugu News