రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారన్న కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వీడియోను ట్వీట్ చేసిన హరీశ్ రావు

Harish Rao questions congress over chinna reddy comments
  • జీవన్ రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారన్న చిన్నారెడ్డి
  • ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రూ.10 లక్షల వరకు ఇస్తామని ఖర్చు పెట్టించారని వెల్లడి
  • ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసి కాంగ్రెస్‌పై హరీశ్ రావు విమర్శలు
  • కాంగ్రెస్ నాయకుడే చెప్పాక కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీత
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చుపెట్టించారని చిన్నారెడ్డి చెప్పాడని బీఆర్ఎస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు చిన్నారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్‌ను 'ఎక్స్' వేదికగా జత చేశారు. ఓట్లను కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఇస్తామని హామీ ఇచ్చి, రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేశారని పేర్కొన్నారు.

ఈ విషయంపై ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల కమిషన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన కేసులు పెట్టటంలో చూపించే అత్యుత్సాహం ఈ విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నప్పటికీ, స్వయంగా కేబినెట్ ర్యాంకులో ఉండి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడే ఇంత మొత్తంలో ఖర్చు చేసినట్లు చెబుతుంటే కేసులు ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు.

కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ దీనిని ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Harish Rao
Telangana
Congress
Graduate MLC Elections

More Telugu News