ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అది భార‌త్‌కు అడ్వాంటేజ్: ప్యాట్ క‌మిన్స్‌

  • దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో ఆడుతుండ‌టం ఇండియాకు అడ్వాంటేజ్ అన్న‌ క‌మిన్స్
  • ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు బలంగా ఉంద‌ని వ్యాఖ్య‌
  • ఒకే మైదానంలో అన్ని మ్యాచ్‌లు ఆడడం వారికి మ‌రింత క‌లిసి వ‌స్తోంద‌న్న క‌మిన్స్‌
  • చీలమండ గాయం కార‌ణంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూర‌మైన స్టార్ ప్లేయ‌ర్  
భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా బీసీసీఐ ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం భార‌త జ‌ట్టును పాకిస్థాన్‌కు పంపించేందుకు నిరాక‌రించ‌డంతో టోర్నీని ఐసీసీ హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో టీమిండియా త‌న మ్యాచ్‌ల‌న్నింటినీ దుబాయ్ వేదిక‌గా ఆడుతోంది. ఈ విష‌య‌మై ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు ప్యాట్ క‌మిన్స్ తాజాగా స్పందించాడు. 

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా భార‌త్ దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు ఆడుతుండ‌టం ఆ జ‌ట్టుకు అడ్వాంటేజ్ అని క‌మిన్స్ తెలిపాడు. ఇప్ప‌టికే టీమిండియా బలంగా ఉంద‌ని, ఈ అంశం వారికి మ‌రింత క‌లిసి వ‌స్తోంద‌ని 'యాహూ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా'తో అన్నాడు. కాగా, చీలమండ గాయం కార‌ణంగా ఈ స్టార్ ప్లేయ‌ర్ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూర‌మైన విష‌యం తెలిసిందే. 

"ఇంట్లో ఉండటం చాలా బాగుంది. అంతా బాగానే జరుగుతోంది. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాను. ఈ వారం పరుగు, బౌలింగ్ ప్రాక్టీస్‌ ప్రారంభిస్తాను. వచ్చే నెలలో ఐపీఎల్ ఉంది. ఆ తర్వాత టెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, వెస్టిండీస్ పర్యటన వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.

ఇక ప్ర‌స్తుతం గాయం నుంచి కోలుకుంటున్న క‌మిన్స్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ద్వారా తిరిగి బ‌రిలోకి దిగ‌నున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టుకు నాయకత్వం వహిస్తున్న కమిన్స్ గత సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అక్కడ వారు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) చేతిలో ఓడిపోవ‌డంతో టైటిల్ చేజారింది.


More Telugu News