Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ రాజకుమారుడు అని తెలుసా... కళ్లు చెదిరే ప్యాలెస్ ఆయన సొంతం!

- సైఫ్ తండ్రి నవాబ్ ఆఫ్ పటౌడీ రాజవంశానికి చెందిన వ్యక్తి
- తండ్రి నుంచి వారసత్వంగా సైఫ్ కు రాజరికం
- పూర్వీకులు నిర్మించిన భవనాన్ని తండ్రి జ్ఞాపకంగా కొనుగోలు చేసిన సైఫ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రాజకుటుంబీకుడు అనే విషయం చాలామందికి తెలియదు. సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్... పటౌడీ రాజవంశానికి చెందినవాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఫేమస్ క్రికెటర్. ఆయనను టైగర్ పటౌడీ అని కూడా అంటారు. పటౌడీ బాలీవుడ్ నటి షర్మిలా టాగోర్ ను వివాహమాడారు. వారి కుమారుడే సైఫ్ అలీ ఖాన్.
ఇప్పుడంటే రాజ్యాలు, రాజులు లేరు కానీ... అనధికారికంగా సైఫ్ ఒక రాజకుమారుడు అని చెప్పుకోవాలి. ఆయన తండ్రికి వారి పూర్వీకుల నుంచి వారసత్వంగా కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు సంక్రమించాయి. వాటిలో ముఖ్యమైనది హర్యానాలోని గుర్గావ్ లో ఉన్న ప్యాలెస్. ఈ రాజభవనం విలువ రూ.800 కోట్లు.
పూర్వపు నిర్మాణ కౌశలానికి మచ్చుతునకలా ఉండే ఈ భవంతి 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. ఇందులో 150 విశాలమైన గదులు ఉంటాయి. ఆ గదులను అందమైన కళాఖండాలతో తీర్చిదిద్దారు. 7 బెడ్రూంలు, 7 బిలియర్డ్స్ రూంలు, అతి భారీ డైనింగ్ హాల్, అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, ప్రత్యేక వ్యవసాయ క్షేత్రం, విలాసవంతమైన ఛాంబర్లు, బహుళ ప్రయోజన గదులతో ఈ ప్యాలెస్ అలరారుతుంటుంది.
వింటేజ్ షాండ్లియర్లు, ప్రాచీన కళాఖండాలు, అద్భుతమైన చిత్రకళ, రాజకుటుంబీకుల నిలువెత్తు చిత్రాలతో ఈ ప్యాలెస్ కళ్లుచెదిరేలా ఉంటుంది. ఈ భవనం ముందు పచ్చదనంతో కూడిన గార్డెన్ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.
ఈ చారిత్రాత్మక ప్యాలెస్ ను 1935లో పటౌడీ వంశ చివరి పాలకుడు ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ నిర్మించారు. బ్రిటీష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ టోర్ రస్సెల్, ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్ట్ కార్ల్ మోలిట్జ్ వాన్ హెంట్జ్ ఈ భవన నిర్మాణ రూపశిల్పులు. ఈ ప్యాలెస్ లో రోజువారీ పనుల నిర్వహణకే వందలామంది పనివాళ్లు అవసరం.
ఓ దశలో ఈ ప్యాలెస్ ను నీర్మాణ హోటల్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే, తండ్రి వారసత్వానికి ఈ భవంతి చిహ్నమని భావించే సైఫ్ అలీ ఖాన్ ఈ భవంతిని తిరిగి నీర్మాణ హోటల్ నుంచి కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు సైఫ్ తన కుటుంబంతో కలిసి ఈ భవనంలో కొన్ని రోజులు విశ్రాంతిగా గడుపుతుంటారు.
కాగా, ఈ ప్యాలెస్ లో కొన్ని బాలీవుడ్ సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. రణబీర్ కపూర్ యానిమల్ చిత్రం, రంగ్ దే బసంతి, వీర్ జారా, తదితర చిత్రాల్లో ఈ భవనం కనిపిస్తుంది.



