ఛాంపియన్స్ ట్రోఫీ: కివీస్ ముందు సింపుల్ టార్గెట్... కానీ...!

 
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఆడుతున్నాయి. ఈ గ్రూప్-ఏ మ్యాచ్ కు రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. 

దాంతో, మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ శాంటో 77, జకీర్ అలీ 45, ఓపెనర్ టాంజిద్ హసన్ 24, రిషాద్ హుస్సేన్ 26 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ 4 వికెట్లతో బంగ్లాదేశ్ ను దెబ్బకొట్టాడు. విలియమ్ ఓ రూర్కే 2, మాట్ హెన్రీ 1, జేమీసన్ 1 వికెట్ తీశారు. 

అయితే, 237 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలో దిగిన కివీస్ కు ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఫాంలో ఉన్న ఓపెనర్ విల్ యంగ్ (0) డకౌట్ కాగా, సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 5 పరుగులకే వెనుదిరిగాడు. విల్ యంగ్ ను తస్కిన్ అహ్మద్ బౌల్డ్ చేయగా... విలియమ్సన్ ను నహీద్ రాణా అవుట్ చేశాడు. దాంతో 15 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. 

ప్రస్తుతం కివీస్ స్కోరు 8 ఓవర్లలో 2 వికెట్లకు 40 పరుగులు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 197 పరుగులు చేయాలి. క్రీజులో రచిన్ రవీంద్ర (13 బ్యాటింగ్), డెవాన్ కాన్వే (22 బ్యాటింగ్) ఆడుతున్నారు.



More Telugu News