పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి ఆగంతుకుడు

Fake Employee Entry Into Police Cammond Control Center
  • టాస్క్ ఫోర్స్ సిబ్బందినంటూ నాటకం
  • సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే రాకపోకలు
  • మొన్న సెక్రటేరియట్ లో... నేడు కమాండ్ కంట్రోల్ లో భద్రతా వైఫల్యం
హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నకిలీ ఉద్యోగి రాకపోకలు సాగించిన విషయం వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ను అంటూ దర్జాగా లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఏకంగా మూడుసార్లు రాకపోకలు సాగించడం భద్రతా వైఫల్యాన్ని బయటపెడుతోంది. 

తాను పోలీస్ డిపార్ట్ మెంట్ మనిషినని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించేందుకు ఆగంతుకుడు ఇలా కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి రాకపోకలు సాగించినట్లు సమాచారం. అత్యంత భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి వెళ్లి వస్తుండడంతో అతడిని నమ్మి రూ.2.82 లక్షలు మోసపోయానని సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వాపోతున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం... కూకట్ పల్లిలో నివాసం ఉంటున్న జ్ఞానసాయి ప్రసాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అంటూ జ్ఞానసాయి ప్రసాద్ తో పరిచయం పెంచుకున్నాడు. హోటల్ వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయని, భాగస్వామ్యంతో బిజినెస్ ప్రారంభిద్దామని నమ్మబలికాడు. తనపై నమ్మకం కలిగేందుకు మంగళవారం నాడు జ్ఞానసాయి ప్రసాద్ ను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు తీసుకొచ్చాడు. దానికి ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్ లో కూర్చోబెట్టి బిజినెస్ గురించి మాట్లాడాడు.

మధ్యమధ్యలో ఫోన్ మాట్లాడినట్లు నటించి కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి వెళ్లివచ్చాడు. ఒకటికి మూడుసార్లు ఇలా వెళ్లిరావడంతో జ్ఞానసాయి ప్రసాద్ కు అతడిపై నమ్మకం కుదిరింది. ఆపై పెట్టుబడిగా రూ.2.82 లక్షలు నిందితుడికి ఇచ్చాడు. అసలు విషయం తెలిశాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్‌ లో నకిలీ ఉద్యోగులు పట్టుబడిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Police Cammond
Hyderabad
Fake Police
Cammond Control
Police Building

More Telugu News