Donald Trump: భారత్ దగ్గర బోల్డంత డబ్బుంది.. ఆ సాయం అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్

Trump defends move to cancel 21 million dollars fund to India
  • భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రూ. 182 కోట్ల నిధులు
  • వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మస్క్ సారథ్యంలోని ‘డోజ్’
  • నిధులు రద్దు చేయడాన్ని సమర్థించుకున్న ట్రంప్
భారత్‌లో ఓటరు శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన రూ. 182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని రద్దు చేయాలన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని, పన్నులు కూడా భారీగానే వసూలు చేస్తోందని, కాబట్టి దానికి (భారత్) ఆర్థికంగా ఎలాంటి సాయం అవసరం లేదని నొక్కి చెప్పారు. 

‘‘భారత్‌కు మేం 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి? వారి వద్దే బోల్డంత డబ్బుంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు కలిగిన దేశం అదే. వారి టారిఫ్‌లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. భారత్ అన్నా, దాని ప్రధాని అన్నా నాకు చాలా గౌరవం. అయితే, ఓటింగ్‌ను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇచ్చే అవసరం మాత్రం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. 

భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’ ఈ నెల 16న ప్రకటించింది. అమెరికా ప్రజల పన్నుల ద్వారా వస్తున్న సొమ్మును ఇలాంటి వాటికి ఖర్చు చేయడం తగదని, కాబట్టి ఇకపై ఇలాంటి వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అమెరికా చేసిన ఈ ప్రకటన బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలకు కారణమైంది. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యానికి అవకాశం కల్పించారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. 
Donald Trump
DOGE
India
Voting
Elon Musk

More Telugu News