MLAs Defection Case: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. సర్వత్ర ఉత్కంఠ

Defection case of BRS MLAs will be heard in the Supreme Court today
  • బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంలో బీఆర్ఎస్ పిటిషన్
  • పార్టీ ఫిరాయింపులను సీరియస్ గా తీసుకున్న ధర్మాసనం
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. 

గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా... సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు నాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా? అని ప్రశ్నించింది. 

ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని... స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే... తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపులు అన్ని రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో... సుప్రీం తీసుకునే నిర్ణయం దేశ వ్యాప్తంగా ప్రభావం చూపనుంది. 

బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలలో అరికెపూడి గాంధీ, పరిగి శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఉన్నారు.
MLAs Defection Case
BRS
Congress
Supreme Court

More Telugu News