Reliance: ముకేశ్ అంబానీకి భారీ షాక్.. వారం రోజుల్లో 67 వేల కోట్ల నష్టం!

Bad news for Mukesh Ambani as Reliance loses over Rs 67500 cr
  • గత వారం వరుసగా 8 సెషన్లలో నష్టపోయిన రిలయన్స్ స్టాక్స్
  • రూ. 16,46,822.12 కోట్లకు పడిపోయిన మార్కెట్ విలువ
  • భారీ నష్టాన్ని చవిచూసినా ఆసియా సంపన్నుడిగా ముకేశ్ హోదా పదిలం
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈ వారం భారీ షాక్ తగిలింది. వారం రోజుల్లోనే ఏకంగా 67,526 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా నష్టాలు మూటగట్టుకుంది. ఆర్ఐఎల్ షేర్లు శుక్రవారం రూ. 1,214.75 వద్ద ముగిశాయి. ఫలితంగా మార్కెట్ విలువ రూ. 16,46,822.12 కోట్లకు పడిపోయింది. భారీ నష్టాలను మూటగట్టుకున్నా ముకేశ్ అంబానీ మాత్రం 90.3 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. 

దేశంలోని అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ల బలహీనతల కారణంగా గత వారం పలు సవాళ్లను ఎదుర్కొంది. అయితే, భారీగా నష్టపోయినా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ముందుండటం గమనార్హం. బలహీన మార్కెట్ సెంటిమెంట్ కారణంగానే రిలయన్స్ షేర్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. 

బలహీన ఇన్వెస్టర్ సెంటిమెంట్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ స్టాక్ సూచీలు వరుసగా 8 సెషన్లలో నష్టపోయాయి. దీనికితోడు గ్లోబల్ ఎకనమిక్ ఒత్తిడి కూడా రిలయన్స్ షేర్ల పతనానికి మరో కారణం. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, విదేశీ నిధుల ప్రవాహంపై ఆందోళనలు రిలయన్స్‌ సహా బ్లూచిప్ స్టాక్‌లను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. అలాగే, చమురు, గ్యాస్ రంగంలో హెచ్చుతగ్గులు, టెలింక పరిశ్రమపై ప్రభావం మదుపర్ల విశ్వాసాన్ని తగ్గించింది.  
Reliance
RIL
Mukesh Ambani
Stocks

More Telugu News