Health: తరచూ శ్వాస సమస్యలు, కీళ్ల నొప్పులా?... ఈ సమస్యే కావొచ్చు!

- కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు
- చిన్న వయసులోనే చర్మం ముడతలు పడటం వంటి ఇబ్బందులు
- దీనికి కారణం ఏమిటనే దానిపై నిపుణుల సూచనలివీ..
కొందరు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఇబ్బందిపెడుతుంటాయి. శరీరానికి తగిలిన గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. చర్మ సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు ఇబ్బందిపెడుతుంటాయి. వీటిన్నింటికీ విటమిన్ సీ లోపమే కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు...
ఎవరైనా తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారినపడుతున్నారంటే... వారిలో విటమిన్ సీ లోపం ఉండే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు ఇమ్యూనిటీ కీలకం. అలాంటీ ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయాలంటే విటమిన్ సీ తప్పనిసరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గాయాలు మానడంలో ఆలస్యం...
కొందరిలో గాయాలుగానీ, సర్జరీ తర్వాత శరీరంగానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. అలాంటి వారిలో విటమిన్ సీ లోపం ఉండే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో గాయాలు మానేందుకు, ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడేందుకు విటమిన్ సీ కీలకమని వివరిస్తున్నారు.
చిన్నవయసులో చర్మం ముడతలు పడటం...
సాధారణంగా వయసు మీదపడటం వల్ల చర్మం ముడతలు పడుతుంది. కానీ కొందరిలో తక్కువ వయసులోనే చర్మం ముడతలు పడుతుంటుంది. దీనికి కారణం చర్మంలో కొల్లాజెన్ పరిమాణం తగ్గిపోవడమే. విటమిన్ సీ మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా చర్మం బిగుతుగా ఉండి యంగ్ గా కనిపిస్తారు.
అకారణంగా అలసటగా అనిపించడం...
సరైన మొత్తంలోనే ఆహారం తీసుకుంటున్నా, పెద్దగా శారీరక శ్రమ చేయకపోయినా కూడా తరచూ అలసట, నీరసంగా ఉంటుంటే... వారిలో విటమిన్ సీ లోపం ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది స్కర్వీ వ్యాధికి సూచిక కూడా కావొచ్చని సూచిస్తున్నారు. ఏదేమైనా అకారణంగా నీరసం ఆవహిస్తుంటే... వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.
చర్మ సమస్యలు
శరీరంలో విటమిన్ సీ స్థాయి తగినంతగా లేకుంటే.. చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. చర్మంపై ఎరుపు లేదా లేత రంగులో పెద్ద మచ్చల్లా ఏర్పడటం, చర్మం ఎండిపోయి, పగుళ్లు రావడం, ముఖ్యంగా నోటి మూలల వద్ద పగుళ్లు వంటి లక్షణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. కొందరిలో చిగుళ్లు సున్నితంగా మారి, రక్తం కారుతుండటం కూడా తలెత్తుతుందని వివరిస్తున్నారు.
తరచూ కీళ్ల నొప్పులు...
విటమిన్ సీ స్థాయి తక్కువగా ఉన్నవారిని తరచూ కీళ్ల నొప్పులు వేధిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోకాళ్లు, నడుము వెనుక భాగాన నొప్పి ఉంటుందని వివరిస్తున్నారు. విటమిన్ సీ లోపం కారణంగా శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి సరిగా జరగక... కీళ్ల వద్ద ఎముకల రాపిడి ఎక్కువైపోతుందని, కండరాలు పట్టేస్తాయని పేర్కొంటున్నారు.
ఈ అంశాలను గమనించండి
పైన చెప్పిన లక్షణాలు ఇతర వ్యాధులు, ఆరోగ్య సమస్యల కారణంగా కూడా తలెత్తే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు తీసుకుని పాటించాలని పేర్కొంటున్నారు.