K Kavitha: అందుకే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు: కవిత

Kavitha reveals why Rahul Gandhi canceled his tour

  • వరంగల్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు కాలేదని విమర్శ
  • ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు విశ్వసించలేదని వ్యాఖ్య
  • సోనియా, రాహుల్, ప్రియాంక వచ్చి చిలుకపలుకులు పలికారని విమర్శ

ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే రాహుల్ గాంధీ తన వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆయనకు వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

వరంగల్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు కాలేదని ఆమె అన్నారు. ఇచ్చిన మాటను తప్పితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని, అందుకే ఢిల్లీ నుండి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి చిలుకపలుకులు పలికారన్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వేయలేదని, ఢిల్లీ నేతల ముఖం చూసి ఓట్లు వేశారన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో నేరాలు 20 శాతం పెరిగాయని ఆమె అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎక్కడో ఒకచోట మతకల్లోలాలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు భద్రత కోసం కూడా పోరాటం చేయాల్సి రావడం బాధాకరమన్నారు. కేసీఆర్ మీద అక్కసుతో కేసీఆర్ కిట్‌లను నిలిపివేశారని ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం అంటూ బస్సుల సంఖ్య తగ్గించారని విమర్శించారు.

K Kavitha
BRS
Telangana
  • Loading...

More Telugu News