అలా చేస్తేనే ప్ర‌భుత్వానికి మంచి పేరు... అధికారుల‌కు సీఎం చంద్ర‌బాబు కీల‌క సూచ‌న‌!

  • ప్ర‌జ‌ల బాధ‌లు, స‌మ‌స్య‌ల‌ను అధికారులు ఓపిక‌తో వినాల‌న్న చంద్ర‌బాబు
  • కొంద‌రు అధికారుల‌ దురుసు ప్ర‌వ‌ర్తన కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌న్న సీఎం
  • ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి చేసినా ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్య‌
ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి స‌మ‌స్య‌లు, బాధ‌ల‌ను ప్ర‌భుత్వ‌ అధికారులు, సిబ్బంది ఓపిక‌తో వినాల‌ని, వారితో మ‌ర్యాద‌పూర్వ‌కంగా మాట్లాడాల‌ని అప్పుడే ప్ర‌భుత్వానికి మంచి పేరు వ‌స్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. కొంత‌మంది అధికారులు, సిబ్బంది ప్ర‌జ‌ల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించే తీరు వ‌ల్ల ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌న్నారు.  

సచివాల‌యంలో ప్రజా వ్యవహారాలపై సమాచార పౌర‌సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా ప్రజంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... పింఛ‌న్ల పంపిణీ స‌మ‌యంలో ల‌బ్ధిదారుల‌తో కొంత‌మంది అధికారులు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం, దబాయించ‌డం లాంటివి చేస్తున్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అన్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి చేసినా ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. 

మ‌నంద‌రం ప్ర‌జ‌ల‌కు జవాబుదారీ అనే విష‌యాన్ని త‌ప్ప‌కుండా గుర్తు పెట్టుకోవాల‌ని అధికారుల‌కు సీఎం సూచించారు. మ‌న వ‌ద్దకు వ‌చ్చే ప్ర‌జ‌ల బాధ‌లు, స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌తో విన‌డం ప్ర‌ధానం అని పేర్కొన్నారు. అధికారుల ప‌నితీరును అంచ‌నా వేయ‌డంలో వారి ప్ర‌వ‌ర్త‌న చాలా కీల‌కమ‌ని, దీన్ని గుర్తుపెట్టుకుని అంద‌రూ ప‌ని చేయాల‌ని తెలిపారు. 

ఇక రాబోయే రోజుల్లో ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల ప‌ట్ల ప్ర‌జ‌లు ఏ మేర‌కు సంతృప్తిగా ఉన్నార‌నే అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు ఒక వినూత్న ప‌ద్ద‌తిని తీసుకువ‌స్తామ‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. త‌ద్వారా ఏ విభాగం ఏ విధంగా ప‌ని చేస్తుంది... అధికారులు ప‌నితీరు ఏంటి... లోపాలు ఎక్క‌డ ఉన్నాయి... అనే విష‌యాల‌పై ఒక అంచ‌నా వ‌స్తుంద‌న్నారు. 


More Telugu News