Chiranjeevi: WAVESపై సినీ ప్ర‌ముఖుల‌తో మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్‌.. ఈ భేటీలో త‌న‌ను భాగం చేసినందుకు ప్ర‌ధానికి చిరు స్పెష‌ల్‌ థ్యాంక్స్‌!

Chiranjeevi Special Thanks to PM Modi for WAVES Summit Advisory Board Meet
  • ఈ ఏడాది చివ‌ర‌లో డ‌బ్ల్యూఏవీఈఎస్ స‌మ్మిట్ నిర్వ‌హ‌ణ‌కు కేంద్రం క‌స‌ర‌త్తు
  • ఈ నేప‌థ్యంలో సినీ ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌ల‌తో మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్
  • పాల్గొన్న అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జినీ, చిరు, నాగ్‌, ముకేశ్ అంబానీ, ఆనంద్ మ‌హీంద్రా
  • ఈ గౌర‌వానికి 'ఎక్స్' వేదిక‌గా ప్ర‌ధానికి చిరు ధ‌న్య‌వాదాలు  
ఈ ఏడాది చివ‌ర‌లో వ‌ర‌ల్డ్ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (డ‌బ్ల్యూఏవీఈఎస్‌) నిర్వ‌హించేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగా సినీ ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌ల‌తో ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. ఈ స‌మావేశంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జనీకాంత్‌, చిరంజీవి, నాగార్జున‌, ఆమిర్‌ఖాన్‌, అక్ష‌య్ కుమార్‌, అనుప‌మ్ ఖేర్‌, హేమ‌మాలిని, దీపిక ప‌దుకొణే, ముకేశ్ అంబానీ, ఆనంద్ మ‌హీంద్రా పాల్గొన్నారు. 

ఇక త‌న‌ను ఈ స‌మావేశంలో భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాని మోదీకి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు చిరు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. త‌న‌కు ద‌క్కిన ఈ గౌర‌వానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 

"గౌరవనీయులైన ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీకి ఈ గౌరవానికి ధన్యవాదాలు. డ‌బ్ల్యూఏవీఈఎస్ (WAVES) సలహా బోర్డులో భాగం కావడం, ఇతర గౌరవనీయ సభ్యులతో పాటు నా అభిప్రాయాల‌ను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టం. మోదీ జ్ఞాన సంతానం అయిన WAVES ఇండియా తాలూకు ‘సాఫ్ట్ పవర్’ను ప్రపంచంలో దాని అర్హమైన ఎత్తులకు నడిపిస్తుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే అన్ని ఉత్సాహాలకు, కొత్త పునాదులకు సిద్ధంగా ఉండండి" అంటూ చిరు ట్వీట్ చేశారు. 
Chiranjeevi
PM Modi
WAVES

More Telugu News