నేడే కేంద్ర బడ్జెట్.. కేటాయింపులపై తెలుగు రాష్ట్రాల ఎదురుచూపులు
- ఉదయం 11 గంటలకు లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మల
- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్
- విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు
2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. వరుసగా ఎనిమిదోసారి నేడు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. గతంలో వరుసగా పదిసార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు.
2019లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ పారిశ్రామిక రంగానికి సంబంధించిన పన్నుల్లో కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారు. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించారు.
2020 బడ్జెట్ లో పాత ఆదాయపు పన్ను విధానంలోని సంక్లిష్టతలను తొలగిస్తూ కొత్త ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు. పాత, కొత్త విధానాలలో దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛను పన్ను చెల్లింపుదారులకు ఇచ్చారు. తాజాగా దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కూడా తీసుకొచ్చారు.
2021–22 బడ్జెట్ లో కంపెనీ చట్టంలోని కొన్ని నిబంధనలను డీక్రిమినలైజ్ చేశారు. విధానపరమైన లోపాలు, సాంకేతికపరమైన తప్పిదాలు వంటి చిన్న ఉల్లంఘనలను నేరాల నుంచి తొలగించారు. కొన్నింటిని సివిల్ పెనాల్టీలతో సరిపెట్టారు. ఇది దేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పడింది.