West Indies: పాకిస్థాన్‌కు విండీస్ దిమ్మ‌తిరిగే షాక్‌... పాక్ గ‌డ్డ‌పై 35 ఏళ్ల త‌ర్వాత క‌రేబియ‌న్ జ‌ట్టు అద్భుత‌ విజ‌యం

West Indies Win Their First Test Match in Pakistan in 35 Years
  • ముల్తాన్ వేదిక‌గా వెస్టిండీస్‌, పాకిస్థాన్ రెండో టెస్టు
  • 120 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన క‌రేబియ‌న్ జ‌ట్టు  
  • ఈ విజ‌యంతో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ 1-1తో స‌మం
  • చివ‌రిసారిగా పాకిస్థాన్ గ‌డ్డ‌పై 1990లో టెస్టు మ్యాచ్‌లో గెలిచిన విండీస్‌
ముల్తాన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. సొంత గ‌డ్డ‌పై పాక్ ప‌రాజ‌యం పాలైంది. పాకిస్థాన్‌ను క‌రేబియ‌న్ జ‌ట్టు 120 ప‌రుగుల తేడాతో ఓడించింది. దీంతో 35 ఏళ్ల త‌ర్వాత పాక్ గ‌డ్డ‌పై విండీస్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. 

ఇంత‌కుముందు చివ‌రిసారిగా పాకిస్థాన్ గ‌డ్డ‌పై వెస్టిండీస్ 1990లో గెలిచింది. ఫైస‌లాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఆ మ్యాచ్‌లో క‌రేబియ‌న్ జ‌ట్టు విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత 1997, 2006లో అక్క‌డ ప‌ర్య‌టించిన విండీస్‌కు ఒక్క విజ‌యం కూడా ద‌క్క‌లేదు. అలా 35 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరదించుతూ ఈరోజు పాక్ గ‌డ్డ‌పై సూప‌ర్‌ విక్ట‌రీని న‌మోదు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 163 ర‌న్స్ చేయ‌గా... పాక్ 154 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆ త‌ర్వాత 9 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన క‌రేబియ‌న్ జ‌ట్టు 244 ర‌న్స్ చేసింది. మొత్తంగా ఆతిథ్య జ‌ట్టుకు 254 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 

అయితే, పాక్ రెండో ఇన్నింగ్స్ లో కేవ‌లం 133 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. దీంతో విండీస్ 120 ప‌రుగుల తేడాతో ఘ‌న‌ విజ‌యం సాధించింది. ఇక విజ‌యంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ 1-1తో స‌మం అయింది. మొద‌టి టెస్టులో పాకిస్థాన్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. 
West Indies
Pakistan
Cricket
Sports News

More Telugu News