సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. బాంద్రా చెరువులో చాకు మూడో భాగం గుర్తింపు

  • 2.5 అంగుళాల పొడవున్న చాకుతో సైఫ్‌పై దాడి
  • దాడి తర్వాత సైఫ్ శరీరంలో మొదటి భాగం
  • ఆపరేషన్ చేసి వెలికి తీసిన వైద్యులు
  • బాంద్రా లేక్‌లో విసిరేసిన మూడో భాగం తాజాగా స్వాధీనం
  • దాడి తర్వాత వర్లి కొలివాడలో క్షవరం చేయించుకున్న నిందితుడు 
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసేందుకు నిందితుడు ఉపయోగించిన చాకులోని మూడో భాగాన్ని పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. బాంద్రా చెరువులో దీనిని గుర్తించి వెలికి తీశారు. 2.5 అంగుళాల పొడవునున్న చాకులోని మొదటి భాగం దాడి తర్వాత సైఫ్ శరీరంలో ఉండిపోయింది. శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు. ఆ తర్వాత రెండో భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా బాంద్రా చెరువులో లభ్యమైనది మూడోది. 

నిందితుడైన మహమ్మద్ షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌ను ఈ నెల 16న అరెస్ట్ చేశారు. నటుడిపై దాడి చేసేందుకు ఉపయోగించిన చాకును అతడు బాంద్రా చెరువులో విసిరేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు నిన్న సాయంత్రం అతడిని అక్కడికి తీసుకెళ్లారు. చెరువులో గాలించి విసిరేసిన ఆ మూడో భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, సైఫ్‌పై దాడిచేసిన ఏడు గంటల తర్వాత నిందితుడు వోర్లి కొలివాడలోని ఓ హెయిర్‌ కంటింగ్ సెలూన్‌కు వెళ్లి క్షవరం చేయించుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.  


More Telugu News