జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్ లో మాధవీలత ఫిర్యాదు

  • జేసీ వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానన్న మాధవీలత
  • తన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారని వెల్లడి
  • అసభ్యకరంగా మాట్లాడి క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్న
టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. గబ్బిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కు వెళ్లిన ఆమె... జేసీపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ... జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. 

సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి... ఆ తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. జేసీ వ్యవహరించిన తీరుతో తన కుటుంబ సభ్యులు కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. సీనియర్ రాజకీయ నాయకుడైన జేసీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 

అసలేం జరిగిందంటే..?

న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి తాడిపత్రిలోని జేసీ పార్క్ లో పట్టణంలోని మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో మహిళల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమానికి మహిళలు హాజరుకావద్దని చెబుతూ మాధవీలత సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. జేసీ పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయని... మహిళలు అక్కడకు వెళ్లవద్దని సూచింది. దీంతో, ఆమెపై జేసీ విరుచుకుపడ్డారు. మాధవీలతను ఒక ప్రాస్టిట్యూట్ అని సంబోధించారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.  


More Telugu News