ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. ఆల్‌టైమ్‌ రికార్డ్‌కు రెండు వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

  • రేప‌టి నుంచి ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 
  • బుధ‌వారం నాడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫ‌స్ట్ టీ20
  • ఇప్పటివరకు భారత్‌ తరఫున టీ20ల్లో మొత్తం 95 వికెట్లు తీసిన అర్ష్‌దీప్
  • మ‌రో రెండు వికెట్లు తీస్తే.. టీమిండియా త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డు
  • ప్రస్తుతం 96 వికెట్లు ప‌డ‌గొట్టి టాప్‌లో ఉన్న స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపు ప్రారంభం కానుంది. మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొద‌టి మ్యాచ్ బుధ‌వారం నాడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మీడియం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఓ ఆల్‌టైమ్‌ రికార్డ్‌కు చేరువ‌లో ఉన్నాడు. ఈ లెఫ్టార్మ్ పేస‌ర్ ఇప్పటివరకు భారత్‌ తరఫున టీ20ల్లో మొత్తం 95 వికెట్లు పడగొట్టాడు. కాగా, దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించడానికి కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.

లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం 79 ఇన్నింగ్స్‌లలో 25.09 సగటు, 18.7 స్ట్రైక్ రేట్‌తో 96 వికెట్లు ప‌డ‌గొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొన‌సాగుతున్నాడు. ఇక‌ అర్ష్‌దీప్ ఇప్పటివరకు 60 టీ20లు ఆడి, 18.1 సగటు, 13.05 స్ట్రైక్ రేట్‌తో 95 వికెట్లు తీశాడు. మ‌రో రెండు వికెట్లు సాధిస్తే.. టీమిండియా త‌ర‌ఫున టీ20ల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అవ‌త‌రిస్తాడు. 

అలాగే ఈ సిరీస్‌లో టీ20 ఇంటర్నేషనల్స్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకునే తొలి భారతీయ బౌలర్‌గా నిలిచే అవకాశం కూడా అర్ష్‌దీప్‌కు ఉంది. అతనితో పాటు హార్దిక్ పాండ్యా కూడా 89 వికెట్లు (97 ఇన్నింగ్స్‌లలో) పడగొట్టి వంద వికెట్ల ఫీట్‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్నాడు.

ఓవరాల్‌గా అర్ష్‌దీప్ సింగ్ మరో ఐదు వికెట్లు తీస్తే పొట్టి ఫార్మాట్‌లో 100 వికెట్లు సాధించిన 20వ బౌలర్‌గా అవ‌త‌రిస్తాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్‌లో బంతితో క్లిక్ చెల‌రేగితే పాండ్యా కూడా ఈ అరుదైన ఘ‌న‌త సాధించే అవకాశం ఉంది. అత్యధిక అంత‌ర్జాతీయ‌ టీ20లు ఆడిన జ‌ట్ల‌లో టీమిండియా (242) రెండో స్థానంలో ఉన్న‌ప్పటికీ భారత బౌలర్లలో ఎవరూ ఇంతవరకు 100 వికెట్ల మార్క్‌ను పూర్తి చేయకపోవడం గ‌మ‌నార్హం. అటు పాక్ (253) ఇప్పటివరకు అత్యధిక టీ20లు ఆడిన జ‌ట్టుగా మొద‌టి స్థానంలో ఉంది.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు
యుజ్వేంద్ర చాహల్- 96
అర్ష్‌దీప్ సింగ్- 95
భువనేశ్వర్ కుమార్- 90
జస్ప్రీత్ బుమ్రా- 89
హార్దిక్ పాండ్యా- 89


More Telugu News