పంజాబ్ కింగ్స్ ఎక్కడ తీసుకుంటుందోనని టెన్షన్ పడ్డా: రిషభ్‌పంత్

  • ఐపీఎల్ మెగా వేలంలో పంత్‌కు రూ. 27 కోట్ల ధర
  • లక్నో సారథ్య బాధ్యతలు పంత్‌కు అప్పగింత
  • వేలం నాటి సంగతులను గుర్తు చేసుకున్న పంత్
గతేడాది నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు తనను ఎక్కడ దక్కించుకుంటుందోనని టెన్షన్ అనుభవించానని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషభ్‌పంత్ గుర్తుచేసుకున్నాడు. వేలంలో పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకున్న లక్నో ఫ్రాంచైజీ తాజాగా అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. సోమవారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో కెప్టెన్సీ వివరాలను ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా వెల్లడించారు. ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ వేలం నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

పంజాబ్ వద్ద పర్స్ ఎక్కువగా ఉండటంతో ఆ జట్టు తనను ఎక్కడ దక్కించుకుంటుందోనని టెన్షన్ అనుభవించానని పంత్ గుర్తు చేసుకున్నాడు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం అంతకుమించిన ధరతో పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. లక్నో ఫ్రాంచైజీ మీపై అంత డబ్బు పెట్టింది కదా.. మరి మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? అన్న ప్రశ్నకు పంత్ బదులిస్తూ గోయెంకాకు ఆందోళన లేనంత వరకు తనకూ ఉండదని పేర్కొన్నాడు. డబ్బు సంపాదించడం మంచిదే కానీ నిత్యం అదే పనిగా దాని గురించి ఆలోచించకూడదని పేర్కొన్నాడు.


More Telugu News