కొండాపూర్‌లో రూ. 200 కోట్ల విలువైన భూమిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ భార్య, ఇతరులు పరస్పర ఫిర్యాదు

  • సర్వే నంబర్ 87/2లో 2.08 ఎకరాల భూమి చుట్టూ వివాదం
  • దానిని తాను 2006లోనే కొనుగోలు చేశానన్న స్వర్ణలతారెడ్డి
  • అది తమదేనంటూ పోటీలు పడి బోర్డులు ఏర్పాటు చేసిన నర్సింహారెడ్డి, అనిల్‌రెడ్డి
  • గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో సర్వే నంబర్ 87/2లో ఉన్న 2.08 ఎకరాల భూమి చుట్టూ వివాదం అలముకుంది. ఈ భూమి విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూమిపై ఇప్పడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి, నర్సింహారెడ్డి అనే వ్యక్తి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ స్థలం తనదేనని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఎ.అనిల్‌రెడ్డి దానిని కబ్జా చేశారని స్వర్ణలతారెడ్డి ఆరోపిస్తుండగా.. సుబ్బారెడ్డి, స్వర్ణలతారెడ్డి కలిసి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నర్సింహారెడ్డి అనే వ్యక్తి తరపున ఆయన వాచ్‌మన్ షేక్ జమీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. కొండాపూర్‌లోని ఈ వివాదాస్పద భూమిని స్వర్ణలతారెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానిని ఎల్‌ అండ్‌ టీకి లీజుకు ఇచ్చారు. 2022లో లీజు గడువు ముగియడంతో ఎల్ అండ్‌ టీ దానిని ఖాళీ చేసింది.

అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నఆ భూమిలో అనిల్‌రెడ్డి ఆ భూమి తనదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఖాళీ చేయాలని కోరినందుకు అనిల్‌రెడ్డి, ఆయన అనుచరులు తమపై దాడి చేశారని స్వర్ణలతారెడ్డి ఈ నెల 5న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు, అదే భూమిలోకి ప్రవేశించిన నర్సిహారెడ్డి.. అనిల్‌రెడ్డి పేరుతో ఉన్న బోర్డును తొలగించి తన పేరుతో కొత్త బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న స్వర్ణలతారెడ్డి మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News