Harish Rao: రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ అబద్ధాలు చెప్పారు: హరీశ్ రావు

Harish Rao blames Revanth Reddy for his statement in Delhi
  • ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీలో అబద్ధాలు చెప్పారని విమర్శ
  • కాంగ్రెస్ సర్కారు ఉద్యోగుల కష్టాలు పట్టించుకోవడం లేదని మండిపాటు
  • పాలనపై దృష్టి సారించాలని హితవు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సీఎం గారూ... మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారని మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి మరీ అబద్ధాలు చెప్పారన్నారు.

ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక కష్టాలు పడుతున్నారన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలు ఇలా వేలాదిమంది చిరు ఉద్యోగులు... తమకు వేతనాలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్న దయనీయ పరిస్థితి నెలకొందన్నారు.

నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో చిరు ఉద్యోగులకు కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుర్చీని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని డబ్బా కొట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించాలన్నారు.
Harish Rao
Telangana
Revanth Reddy

More Telugu News