Pawan Kalyan: చెత్త రవాణా వాహనం ప్రారంభించి, స్వయంగా నడిపిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan inaugurates waste transport vehicle and drove
  • నంబూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం
  • పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం పరిశీలన
  • 35 మంది పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో 'స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

గ్రామ స్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను పవన్ కల్యాణ్ ప్రారంభించి స్వయంగా నడిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు. 

శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో నంబూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో  పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇక, పవన్ కల్యాణ్ నంబూరులోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద మొక్కను నాటి 'స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ స్థాయిలో సేకరించిన చెత్త నిర్వహణా క్రమాన్ని పరిశీలించారు. మొదట పళ్లు, కూరగాయల వ్యర్ధాల నిర్వహణను పరిశీలించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల రీ సైక్లింగ్, శానిటరీ వేస్ట్ మేనేజ్ మెంట్ పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వ్యర్ధాలతో వర్మి కంపోస్ట్ తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. 

ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న మూడు రకాల బుట్టలను అధికారులు పవన్ కల్యాణ్ కు చూపారు. తడి చెత్త, పొడి చెత్తతో పాటు విష పూరిత వ్యర్ధాలను వేరు చేసేందుకు ఇంటికి మూడు చెత్త బుట్టలు ఇస్తున్నట్టు తెలిపారు. చెత్త నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల యంత్ర పరికరాల పనితీరుని పవన్ కల్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామాల వివరాలు, సంపద సృష్టి కేంద్రాల సహకారంతో పండించిన పళ్లు, కూరగాయల ప్రదర్శనను తిలకించారు. 

అంతేకాదు, ఇటీవల విజయవాడ వరదల్లో అహర్నిశలు పని చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేసిన 35 మంది స్వచ్ఛ కార్మికులను పవన్ కల్యాణ్  త్కరించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ, శాలువా కప్పి నూతన వస్త్రాలు, పళ్లు బహూకరించారు. 
Pawan Kalyan
Swacha Andhra Swacha Diwas
Namburu
Janasena

More Telugu News