అర్ధాంగిని ఓదార్చిన దర్శకుడు సుకుమార్

  • యుక్తవయసులో ఉన్న ఏ అమ్మాయి గుండు కొట్టించుకునేందుకు ఇష్టపడదన్న సుకుమార్ అర్ధాంగి తబిత
  • 'గాంధీ తాత చెట్టు' మూవీ కోసం తన కుమార్తె సుకృతి వేణి గుండు కొట్టించుకుందంటూ భావోద్వేగానికి గురైన తబిత
  • అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామన్న తబిత
ప్రెస్ మీట్‌లో తన అర్ధాంగి తబిత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో దర్శకుడు సుకుమార్ ఆమెను ఓదార్చాడు. పద్మావతి మల్లాది తెరకెక్కించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రంలో సుకుమార్, తబిత దంపతుల కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించింది. బాల నటిగా సుకృతి .. ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం అందుకోవడంతో పాటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆప్ ఇండియా అవార్డులు కూడా ఆమెను వరించాయి.

11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా, న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ బెస్ట్ ఫిల్మ్‌గా, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ బెస్ట్ ఫిల్మ్‌గా 'గాంధీ తాత చెట్టు' నిలిచింది. ఈ నెల 24న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రం యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. 

ఈ ప్రెస్‌మీట్‌లో సుకుమార్ అర్ధాంగి తబిత మాట్లాడుతూ.. యుక్తవయసులో ఉన్న ఏ అమ్మాయీ గుండు చేయించుకోవడానికి ఇష్టపడరని, కానీ  తన కుమార్తె సుకృతి వేణి.. ‘గాంధీ తాత చెట్టు’ మూవీ కోసం గుండు చేయించుకుందంటూ భావోద్వేగానికి గురయ్యారు. అతిధి సీట్లో కూర్చున్న సుకుమార్ వెంటనే వేదికపైకి వెళ్లి అర్ధాంగి తబితను ఓదార్చారు. ఈ మూవీ అవార్డులు సాధించాలని ముందు నుంచీ అనుకున్నామని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని తబిత పేర్కొన్నారు.  


More Telugu News