కొడుకు బౌలింగ్‌లో సిక్సర్.. క్యాచ్ అందుకున్న తండ్రి.. బీబీఎల్‌లో అరుదైన దృశ్యం.. వీడియో ఇదిగో

  • అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ బ్రిస్బేన్ హీట్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
  • అడిలైడ్ పేస్ బౌలర్ లియామ్ హాస్కెట్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన నాథన్ మెక్‌స్వీనీ 
  • ప్రేక్షకుల స్టాండ్స్‌లో క్యాచ్ అందుకున్న బౌలర్ హాస్కెట్ తండ్రి
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
క్రికెట్ మైదానాల్లో ఆటతో పాటు అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో (బీబీఎల్) జరిగింది. ఒక బౌలర్ ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌కు సంధించిన బంతి నేరుగా వెళ్లి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య కూర్చొని  మ్యాచ్‌ను వీక్షిస్తున్న అతడి తండ్రి చేతిలో పడింది. అడిలైడ్ స్ట్రైకర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.

252 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బ్రిస్బేన్ హీట్ బ్యాటింగ్ చేస్తుండగా అడిలైడ్ స్ట్రైకర్స్ పేస్ బౌలర్ లియామ్ హాస్కెట్ బౌలింగ్‌లో బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ భారీ సిక్సర్ బాదాడు. అయితే, మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న బౌలర్ హాస్కెట్ తండ్రి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అరుదైన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, అడిలైడ్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 251 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 109 పరుగుల సాధించిన మాథ్యూ షార్ట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ బ్యాటర్లు కూడా బాగానే పోరాడారు. 195 పరుగులకు ఆలౌట్ అయ్యారు.


More Telugu News