Narendra Modi: నా కోసం నేనో ఇల్లు కట్టుకోలేదనే విషయం దేశానికి తెలుసు: ప్రధాని మోదీ

PM Narendra Modi Slams AAP Govt In Delhi
  • గత పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్లు కట్టామన్న మోదీ
  • మేం అద్దాల మేడలో ఉండటం లేదన్న ప్రధాని
  • పదేళ్లుగా ఢిల్లీని ఓ విపత్తు చుట్టుకుందన్న ప్రధాని
  • బీజేపీలోనే అసలైన విపత్తు ఉందన్న కేజ్రీవాల్
మోదీ తన కోసం ఇల్లు కట్టుకోలేదన్న విషయం దేశం మొత్తానికి తెలుసని, కానీ గత పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించి వారి కలలను సాకారం చేశామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాము నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని... కానీ తానేమీ అద్దాల మేడలో ఉండటం లేదన్నారు.

ఢిల్లీ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వం లిక్కర్, స్కూల్, పొల్యూషన్ స్కాంలకు పాల్పడిందని విమర్శించారు. బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. గత పదేళ్లుగా ఢిల్లీని ఓ విపత్తు చుట్టుముట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు ప్రజలు ఆ విపత్తుకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు.

బీజేపీలోనే అసలైన విపత్తు: కేజ్రీవాల్

అసలైన విపత్తు బీజేపీలోనే ఉందంటూ ప్రధాని మోదీకి మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో విపత్తు లేదని, బీజేపీలోనే ఉందన్నారు. అసలు బీజేపీకి ఢిల్లీలో సీఎం అభ్యర్థి లేరని, ఆ పార్టీకి ఎలాంటి విజన్ లేదని, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి అసలు అజెండానే లేదని కేజ్రీవాల్ మూడు పాయిట్లతో విమర్శలు గుప్పించారు. వేల కోట్లతో భవనం నిర్మించుకున్న వ్యక్తి... వేల కోట్లతో విమానంలో తిరిగే వ్యక్తి... లక్షల విలువ చేసే సూట్ ధరించే వ్యక్తి నుంచి అద్దాల మేడ ప్రస్తావన రావడం విడ్డూరంగా ఉందన్నారు.
Narendra Modi
Arvind Kejriwal
BJP
AAP

More Telugu News